Banswada News
బోనాల వేడుకల్లో పోచారం.. అమ్మవారికి ప్రత్యేక పూజలు
Quick Summary:
ప్రజలు, రైతులు సుభిక్షంగా ఉండాలి.. అమ్మవారిని వేడుకున్న పోచారం.
5టీవీ న్యూస్ హైదరాబాద్ : ఆషాఢమాసం సందర్భంగా హైదరాబాద్ ఎల్బీనగర్లోని ఖిల్లా మైసమ్మ ఆలయంలో నిర్వహించిన బోనాల మహోత్సవాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ విప్, వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం హైదరాబాద్ జియాగూడ సబ్జీ మండి మహంకాళి ఆలయ కమిటీ ప్రత్యేక ఆహ్వానం మేరకు మహంకాళి అమ్మవారి బోనాల పండుగలో పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో గజరాజు గజమాలతో పోచారం శ్రీనివాసరెడ్డిని ఘనంగా సత్కరించి ఆశీర్వదిస్తూ స్వాగతం పలికింది.ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచిన బోనాల పండుగను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ భావితరాలకు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని, ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని తెలిపారు.ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.